వైసీపీ, బీజేపీ మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమే:వైసీపీ అధికార ప్రతినిధి

 

 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, బీజేపీ మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం నిజమేనని స్పష్టం చేశారు వైసీపీ విజయవాడ పట్టణశాఖ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారి. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో కొఠారి తమ పార్టీ విధానాన్ని వెల్లడించారు.

తాము రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామని.. ఆ తర్వాత పలు నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించామని పేర్కొన్నారు. వైసీపీ, బీజేపీ మధ్య వంద శాతం మధ్య అవగాహన ఉందన్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి తన పనిని సమర్థంగా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, జగన్‌కు మధ్య బంధం బలపడటానికి చాలా చేశారని చెప్పారు.

బీజేపీకి కనీసం అభ్యర్థులు కూడా లేరని.. అందుకే వారు పోటీచేసే కొన్ని స్థానాల్లోనైనా వైసీపీ తరఫున బలహీన అభ్యర్థులను నిలుపుతున్నామన్నారు కొఠారి. కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంలో.. తమ పార్టీ తరఫున బలహీన అభ్యర్థి పోటీలో ఉంటారన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమే కాదని.. పార్టీ విధానం కూడా అని కుండబద్దలు కొట్టారు. జగన్‌ నేరుగా ఈ విషయం తమతో చెప్పరని.. పెద్దిరెడ్డి లాంటి ఐదారుగురు నేతలు జగన్‌తో మాట్లాడతారని.. వారే తమకు సమాచారం అందజేస్తారన్నారు.