వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఈ సారి గెలుపెవరిదో..

ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచింది బావ.. బావమరిది. గత రెండు దఫాలుగా వారే ప్రత్యర్థులు.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా.. అసలు యుద్ధం మాత్రం వీరి నడుమే. సిక్కోలులో అందరి చర్చా ఆమదాలవలస నియోజకవర్గంపైనే. ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ టీడీపీ నుంచి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వైసీపీ తరఫున హోరాహోరీ తలపడుతున్నారు.

తమ్మినేని అక్క జయలక్ష్మి కుమారుడే రవికుమార్‌. అలాగే సీతారాం భార్య వాణి స్వయానా రవికుమార్‌కు అక్క. మేనమామ-మేనల్లుడు, బావ-మరిది అయ్యారు. తమ్మినేని టీడీపీలో ఒకప్పుడు సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావానంతరం 1983, 85ల్లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 1989లో ఓడినా.. మళ్లీ 1994, 99ల్లో అదే పార్టీ నుంచి గెలిచారు. తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి ఇక్కడి నుంచే బరిలోకి దిగగా.. ఆయనపై ఆయన బావమరిది కూన రవికుమార్‌ టీడీపీ తరపున పోటీచేశారు. ఓట్లు చీలిపోవడంతో కాంగ్రెస్‌ ఇక్కడ గెలిచి.. తమ్మినేని రెండో స్థానంలో.. రవి మూడో స్థానంలో నిలిచారు. తమ్మినేని మళ్లీ టీడీపీలో చేరి కొద్దికాలం తర్వాత వైసీపీలోకి వెళ్లారు. తమ్మినేని టీడీపీలో ఉన్నప్పుడే రవికుమార్‌ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

పొందూరు మండలాధ్యక్షుడిగా, జడ్పీటీసీగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. తమ్మినేని టీడీపీని వీడాక పార్టీ కార్యక్రమాలను తానే నడిపించారు. కేడర్‌పై పట్టు పెంచుకున్నారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బావ తమ్మినేనిపై సునాయాసంగా గెలుపొందారు. సీఎం చంద్రబాబు ఆయన్ను ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఇప్పుడు ఉభయులూ అవే పార్టీల నుంచి బరిలోకి దిగారు. ఇద్దరూ వ్యక్తిగత ప్రతిష్ఠకు తీసుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. మంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన పనులు, వైసీపీ శ్రేణుల అండతో గెలుస్తానని తమ్మినేని.. ఈ ఐదేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని రవికుమార్‌ భావిస్తున్నారు.

రవికుమార్‌ (టీడీపీ) సానుకూలతలు
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం
సంక్షేమపథకాలుప్రజలకు చేరువచేయడం
అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌ కార్డుల మంజూరు

బలహీనతలు..
పార్టీ కార్యకర్తలకే ప్రాధ్యానమిస్తారన్న ఆరోపణలు
అన్ని విషయాల్లో దుందుడుకుతనం
విమర్శలను తట్టుకోలేకపోవడం

తమ్మినేని (వైసీపీ) సానుకూలతలు
ప్రజలను ఆకట్టుకునే వాగ్ధాటి..
మంత్రిగా పనిచేసిన అనుభవం
వరుస ఓటములతో సానుభూతి.

ప్రతికూలతలు..
తరచూ పార్టీలు మారడం
కేడర్‌ను కాపాడుకోలేకపోవడం
ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం
వివాదాలను మూటకట్టుకోవడం