వైఎస్ వివేకా మృతిపై అనుమానాలకు కారణాలు ఇవే..!

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి తెలిపారు. లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో వాస్తవాలు బయటికొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన పెదనాన్న మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరో దాడి చేస్తే చనిపోయినట్లు ఉందని, తలకు ముందువెనుక గాయాలున్నాయని, చేతులకు గాట్లు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పారు. వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక వివేకానందరెడ్డి పీఏ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. డాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దింపారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం జరగనుందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏం జరిగిందనేది తేలుతుందని ఎస్పీ తెలిపారు. బాత్రూంలో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ చెప్పారు.